Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి :: అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకుకు MLA కొణతాల రామకృష్ణ కృషితో రూ. 1కోటి ప్రభుత్వ నిధులతో నూతన పరికరాలు సమకూరాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇప్పటివరకు రోగికి ప్లాస్మా, ప్లేట్ లెట్స్ అవసరమైతే విశాఖ కేజీహెచ్ కు సిఫార్సు చేయడం జరిగేది. కాగా ఎన్టీఆర్ వైద్యాలయంలో రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్లెట్స్, ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్ (పిఆర్ బీసీ), క్రియో సెల్స్ ను వేరు చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై ఈ సేవలు ప్రజలకు చేరువ కానున్నాయి. కరోనా లాంటి విపత్కర సమయంలో రోగిని కోలుకునేలా చేయడంలో ప్లాస్మా థెరపీ ప్రపంచ దేశాల్లోనే విజయవంతంగా పనిచేసింది. ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది. ప్రస్తుతం అత్యవసర సమయాల్లో మధుమేహం, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో ప్రాణం మీదకు వస్తే ప్లాస్మా థెరపీ ఓ ఆశగా కనిపిస్తోంది. అలాంటి ప్లాస్మాను రక్తదాతల రక్తం సేకరణ ద్వారా వేరు చేసే పరికరాలు ఎన్టీఆర్ వైద్యాలయానికి సమకూరాయి. జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు రక్తం నుంచి ప్లేట్లెట్స్ వేరు చేసే పరికరాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది రోగులకు ఓ రకమైన శుభవార్త. అలాగే క్రియో సెల్స్ ను కూడా వేరు చేసే పరికరాలు వస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా కోటి రూపాయల వ్యయంతో ఈ పరికరాలు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి మంజూరు కావడం విశేషం. ఇదిలా ఉండగా రక్తదానం వల్ల చాలామందిని కాపాడటమే కాదు రక్తదానం చేసిన వారికి ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. రక్తదానంలో రక్తాన్ని నిల్వజేయడం సెల్స్ గా మార్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆళ్ల రామచంద్రరావు స్పష్టం చేశారు. రక్తహీనత కలిగిన వారికి, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి ప్లాస్మా, ప్లేట్ లెట్స్, పిఆర్బిసి, క్రియోసెల్స్ ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. రక్తం నుంచి వీటిని వేరు చేసే ఈ నూతన పరికరాలు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి రావడం శుభ పరిణామం అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ కృష్ణన్, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణకు ఆళ్ల రామచంద్రరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైద్యాలయంలోని బ్లడ్ బ్యాంకుకు వీరు మహర్దశ తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు, డిఎంఅండ్ హెచ్ ఓ హైమావతి, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ రమేష్, టెక్నీషియన్స్ లోకేష్, రమేష్, రాజు, గీత, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తాడి శాంతి కుమారి రామకృష్ణ, డాక్టర్ డి డి నాయుడు, గొర్లి శేఖర్, ఉల్లింగల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV