Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని శుభ్రత, నిర్వహణ, రికార్డుల సంరక్షణను సమీక్షించారు. అన్ని రికార్డులు సమయానికి నవీకరించాలనే సూచనలతో పాటు, నేర నివారణపై మరింత దృష్టి పెట్టాలన్నారు. స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న నేరాల స్వరూపం గురించి అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న ఆయన నేర చరిత్ర గలవారి మరియు అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు, మహిళలకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ మరియు మహిళా చట్టాలపై శక్తి యాప్ ప్రాముఖ్యతను తెలిపి ప్రతి ఒక్కరూ యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. రహదారి భద్రతా ప్రమాణాలు, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అనేది నేర నియంత్రణలో కీలకమని, దీనిపై ప్రజలలో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు.
తనిఖీ అనంతరం ఆయన పోలీసు సిబ్బందితో సమావేశమై , వారి సేవలను అభినందించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ తనిఖీ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఎల్.రేవతమ్మ, తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.
Reporter
Rapid TV