Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : గొలుగొండ మండలంలోని ఏటి గైరంపేట గ్రామంలో శుక్రవారం నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్సై రామారావు నేతృత్వంలో శక్తి బృందం సహకారంతో గ్రామస్తులకు కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక గంజాయి వ్యాపార నివారణపై పలు సూచనలు చేశారు. ఏటిగైరంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉండటంతో, గంజాయి వ్యాపారం ఈ ప్రాంతం పరిధిలో ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో గంజాయి వ్యాపారం వలన కలిగే కష్టాలు , చట్టపరమైన చర్యలు, ఎదుర్కొనే శిక్షలు, వారి కుటుంబాలలో కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గంజాయి వ్యాపారంలో సంబంధాలు కలిగి ఉన్నవారందరికీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్ట విరుద్ధంగా గంజాయి సాగు, రవాణా, నిల్వ లేదా సరఫరా చేసిన వారిపైనా, వారితో స్నేహం లేదా సంబంధం కొనసాగిస్తున్నవారి పైనా,గంజాయి రవాణాకు తమ వాహనాలు లేదా ఇతర సహాయం అందిస్తున్నవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. అదేక్రమంలో గంజాయి వ్యవహారాల్లో నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనేవారిపై పి డి యాక్ట్ నమోదు చేసి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించబడుతుందని తెలిపారు.
గ్రామస్థులు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించి, గ్రామాన్ని నేరరహితంగా మార్చడంలో భాగస్వాములవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేకాక సైబర్ మోసాలపై జాగ్రత్తలు, మహిళలపై జరిగే నేరాలు నివారించే మార్గాలు, రహదారి భద్రత- ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం రూపొందించబడిన 'శక్తి యాప్ ' ను ప్రతీ మహిళ తప్పకుండా తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, ఇది అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కల్పిస్తుందని విజ్ఞప్తి చేశారు.
Reporter
Rapid TV